Aloo Mixture : బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఆలూ మిక్చర్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా స్వీట్ షాపుల్లో లభిస్తుంది. ఆలూ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ ఆలూ మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో దీనిని తయరు చేసుకోవచ్చు. ఒకేసారి తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 4( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పల్లీలు – అర కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు, జీడిపప్పు – 15, పుట్నాల పప్పు – అర కప్పు, ఉప్పు- 3 చిటికెలు, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్.
ఆలూ మిక్చర్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి సన్నగా పొడుగ్గా తురుముకోవాలి. లేదంటే ముందుగా వీటిని చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ చిప్స్ ను ఒకదానిపై ఒకటి ఉంచి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా అన్నింటిని కట్ చేసుకున్న తరువాత 3 సార్లు బాగా కడగాలి. తరువాత అవి మునిగే వరకు నీటిని పోసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఈ ఆలూ స్ట్రిప్స్ ను వడకట్టి చల్లటి నీటిలో వేసి చల్లారే వరకు ఉంచాలి. తరువాత వీటిని వస్త్రంపై వేసి తడి ఆరే వరకు ఆరబెట్టాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆలూ స్ట్రిప్స్ వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పల్లీలు వేసి వేయించి తీసుకోవాలి. తరువాత కరివేపాకు, జీడిపప్పు, పుట్నాల పప్పు కూడా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, కారం,చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మిక్చర్ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఆలూ మిక్చర్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.