Aloo Rolls : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని అంరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనం బంగాళాదుంపలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ లో ఆలూ రోల్స్ కూడా ఒకటి. ఆలూ రోల్స్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ ఆలూ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, వాము – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వేడి నూనె – 2 స్పూన్స్, ఉడికించిన బంగాళాదుంపలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అటుకుల పొడి – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ రోల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో వాము. ఉప్పు, వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పుతో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత పిండి ముద్దను తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి.
తరువాత చపాతీ అంచులను తీసేస్తూ చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని రెండు ఇంచుల వెడల్పుతో పట్టీలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక్కో పట్టీని తీసుకుని అందులో బంగాళాదుంప ఉండను ఉంచి రోల్ చేసుకోవాలి. ఈ రోల్ ఊడిపోకుండా టూత్ పిక్ ను ఉంచాలి. లేదంటే రోల్ చివరన నీటితో తడి చేసి అతికించాలి. ఇలా అన్నింటిని తయరు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రోల్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ రోల్స్ తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఒకటి కూడా విడిచిపెట్టకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.