Amla Murabba : విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిల్లో ఉసిరికాయ కూడా ఒకటి. ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు ఒక ఉసిరికాయను తప్పకుండా తీసుకోవాలని మనకు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఇవి మనకు సంవత్సరమంతా లభించవు. కనుక ఈ ఉసిరికాయలతో మనం ఆమల్ఆ మురబ్బాను తయారు చేసుకోవడం వల్ల సంవత్సరమంతా రోజుకు ఒక ఉసిరికాయను తినవచ్చు.
ఈ ఆమ్లా మురబ్బా రుచిగా ఉండడంతో పాటు సంవత్సరమంతా నిల్వ ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఉసిరికాయలతో రుచిగా ఆమల్ఆ మురబ్బాను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా నిల్వ చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమ్లా మురబ్బా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ఉసిరికాయలు – 500 గ్రా., కండ చక్కెర – అరకిలో, నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, సైంధవ లవణం – అరటీ స్పూన్, శొంఠి పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్.
ఆమ్లా మురబ్బా తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ఉసిరికాయలతో ఫోర్క్ తో లేదా చాకుతో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. తరువాత ఈ ఉసిరికాయలను అవిరి మీద 20 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత వీటిని తీసి పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు కండ చక్కెరను పలుకులుగా చేసుకుని జార్ లో వేసి మెత్తనిపొడిలా చేసుకోవాలి. ఈ మురబ్బాను తయారు చేసుకోవడానికి గానూ కేవలం స్టీల్ గిన్నెను లేదా నాన్ స్టిక్ కళాయిని మాత్రమే వాడాలి. తరువాత ఒక స్టీల్ గిన్నెలో మిక్సీ పట్టిన కండ చక్కెర పొడిని తీసుకోవాలి. ఇందులోనే ఉడికించిన ఉసిరికాయలు, నీళ్లు పోసి కలుపుతూ వేడి చేయాలి. చక్కెర కరిగిన తరువాత మూత పెట్టి మధ్యస్థ మంటపై 7 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, సైందవ లవణం, శొంఠి పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత మలా మూత పెట్టి చిన్న మంటపై మరో 15 నిమిషాల పాటు ఉడికించాలి. చక్కెర పాకం బంగారు వర్ణంలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లా మురబ్బా తయారవుతుంది. దీనిని గాజు డబ్బాలో లేదా సిరామిక్ డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. స్టీల్ పాత్రలో, అల్యూమినియం పాత్రలో వేయకూడదు. ఈ విధంగా తయారు చేయడం వల్ల ఆమ్లా మురబ్బా సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఉసిరికాయలను రోజుకు ఒకటి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.