Amla Murabba : ఉసిరికాయలు.. ఇవి మనందరికి తెలిసినవే. ఉసిరికాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఉసిరికాయలను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పచ్చడితో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటా. ఉసిరికాయలతో చేసుకోదగిన వాటిల్లో ఆమ్లా మురబ్బా కూడా ఒకటి. తియ్యగా, రుచిగా ఉండే వంటకాన్ని తయారు చేయడం చాలా సులభం. దీనిని తినడం వల్ మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఉసిరికాయలతో ఎంతో రుచిగా ఉండే ఆమ్లా మురబ్బాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమ్లా మురబ్బా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉసిరి కాయలు – అర కిలో, పంచదార – అరకిలో, నీళ్లు – 2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
ఆమ్లా మురబ్బా తయారీ విధానం..
ముందుగా ఉసికాయలను తీసుకుని శుభ్రపరిచి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు వేడాయ్యక ఒక చిల్లుల ప్లేట్ లో ఉసిరికాయలను తీసుకుని ఆ ప్లేట్ ను గిన్నెలో ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉసిరికాయలను ఉడికించాలి. ఈ మధ్య మధ్యలో కదుపుతూ మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఒక్కో ఉసిరికాయను తీసుకుంటూ ఫోర్క్ లేదా టూత్ పిక్ తో రంధ్రాలు పెట్టాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార, నీళ్లు వేసి వేడి చేయాలి. ఇందులోనే ఉడికించిన ఉసిరికాయలను కూడా వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత ఉప్పు, నిమ్మరసం, యాలకుల పొడి వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత మంటను చిన్నగా చేసి పంచదార మిశ్రమం ముదురు పాకం వచ్చే వరకు మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఉసిరికాయలతో పాటు పంచదార మిశ్రమం కూడా రంగు మారుతుంది. ఇలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉంచాలి. తరువాత ఈ ఉసిరికాయలు ఒక గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లా మురబ్బా తయారవుతుంది. ఉసిరికాయలను నిల్వ చేయగా మిగిలిన పంచదార మిశ్రమంతో షర్బత్ వంటి పానీయాలను తయారు చేసుకోవచ్చు. ఈ ఆమ్లా మురబ్బా సంవత్సరం పాటు పాడవకుండా తాజాగా ఉంటుంది. వాంతులు ఎక్కువగా అవుతున్నప్పుడు ఈ ఆమ్లా మురబ్బాను తినడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.