Anasuya : ఉక్రెయిన్‌లో ప్రస్తుతం మారణహోమం జరుగుతున్న విషయం విదితమే. రష్యా ఆ దేశంపై గత రెండు రోజుల నుంచి మిలిటరీ చర్యను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యా ముందుకు సాగుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. తమ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని.. కలగజేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ ప్రపంచ దేశాలు అన్నీ రష్యా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే ఈ యుద్ధంపై బుల్లితెర యాంకర్ అనసూయ స్పందించింది.
ఉక్రెయిన్ గతంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు ఓటు వేసింది. అలాగే భారత్ వద్దని చెబుతున్నా వినకుండా భారత్ శత్రుదేశాలైన పాక్, చైనాలకు ఉక్రెయిన్ ఆయుధాలను సరఫరా చేసింది. అయితే ఇదే విషయాన్ని ఓ నెటిజన్ చెబుతూ.. ఉక్రెయిన్‌కు తగిన శాస్తి జరిగిందని.. ఆ దేశంపై జాలి పడాల్సిన అవసరమే లేదని కామెంట్ చేశాడు. అయితే అతని కామెంట్‌పై అనసూయ స్పందించింది. ఇంత మానవత్వం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు, అక్కడ ఉన్నది పౌరులు, ఈ సమయంలో అలాంటి కామెంట్స్ చేయడం సరికాదని ట్వీట్ చేసింది.
తాను గతంలో ఉక్రెయిన్ కు ఓ షూటింగ్ కోసం వెళ్లానని.. అది చాలా అద్భుతమైన దేశమని.. మళ్లీ అక్కడికి వెళ్లాలని ఉందని అనసూయ తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా అనసూయ ఈ మధ్య కాలంలో పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అలరించింది. అలాగే మొన్నీ మధ్య విడుదలైన రవితేజ ఖిలాడి మూవీలోనూ నటించింది. ఇక త్వరలో పుష్ప 2 సినిమాలో నటించనుంది.