Andhra Style Prawns Fry : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా కలిగిన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రొయ్యలను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. రొయ్యలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీ, షుగర్ వంటి వ్యాధులను నియంత్రించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మనలో చాలా మందికి రొయ్యల వేపుడు రుచి గురించి తెలిసే ఉంటుంది. ఈ రొయ్యల వేపుడును ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆంధ్రా స్టైల్ లో రొయ్యల వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా రొయ్యల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి రొయ్యలు – అర కిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 4, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2 (పెద్దవి), కరివేపాకు – రెండు రెబ్బలు, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
ఆంధ్రా రొయ్యల వేపుడు తయారీ విధానం..
ముందుగా రొయ్యలలో ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ నిమ్మ రసం వేసి కలిపి బాగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఈ రొయ్యలలో తగినంత ఉప్పును, కారాన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను, పసుపును వేసి కలిపి మూత పెట్టి అర గంట పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చిని, ఉల్లిపాయలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసి కలిపి రొయ్యలలో ఉండే నీరు అంతా పోయి వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు మంటను చిన్నగా చేసి ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత తరిగిన పుదీనాను, కొత్తిమీరను, నిమ్మరసాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆంధ్రా రొయ్యల వేపుడు తయారవుతుంది. దీనిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా రొయ్యలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. తరచూ ఇలా రొయ్యలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో రొయ్యలు ఎంతగానో ఉపయోగపడతాయి.