Biyyam Pindi Chekkalu : మనం వంటింట్లో రకరకాల చిరు తిళ్లను తయారు చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో తయారు చేసుకునే చిరు తిళ్లల్లో చెక్కలు కూడా ఒకటి. వీటిని బియ్యం పిండితో తయారు చేస్తారు. వీటి రుచి మనందరికీ తెలుసు. ఇవి మనకు బయట కూడా దొరుకుతూ ఉంటాయి. బయట దొరికే చెక్కలు రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చెక్కలు కరకరలాడుతూ ఉండేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చెక్కలు రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి చెక్కల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కిలో, పచ్చి మిర్చి – 10 లేదా రుచికి తగినన్ని, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – గుప్పెడు, శనగపప్పు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పు, ఉప్పు – తగినంత, వెన్న – 2 టేబుల్ స్పూన్స్, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
బియ్యం పిండి చెక్కల తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని తీసుకుని కడిగి తగినన్ని నీళ్లను పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత జల్లిగిన్నెలో బియ్యాన్ని వేసి నీరు అంతా పోయే వరకు ఉంచాలి. ఈ బియ్యం తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలి. తడి పిండితో చెక్కలను చేయడం వల్ల చెక్కలు కరకరలాడుతూ ఉంటాయి. అలాగే శనగపప్పును, పెసర పప్పును కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఒక జార్ లో పచ్చి మిర్చిని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే జీలకర్ర, కరివేపాకును వేసి మరలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో తడి బియ్యం పిండిని, నానబెట్టుకున్న శనగపప్పును, పెసరపప్పును, మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి మిశ్రమాన్ని, ఉప్పును వెన్నను వేసి బాగా కలుపుకోవాలి. వెన్న అందుబాటులో లేని వారు నూనెను కొద్దిగా వేడి చేసి కూడా కలుపుకోవచ్చు.
ఇప్పుడు కొద్ది కొద్దిగా తగినన్ని గోరు వెచ్చని నీళ్లను పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ముద్దలను ఒక మందపాటి పాలిథీన్ కవర్ పై ఉంచి నూనెను రాసుకుంటూ మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె బాగా కాగిన తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి ఒక్కో చెక్కను వేసి రెండు దిక్కులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే బియ్యం పిండి చెక్కలు తయారవుతాయి. బయట చిరుతిళ్లకు బదులుగా ఇలా ఇంట్లో ఎంతో సురక్షితంగా చెక్కలను తయారు చేసుకుని తినవచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం తప్పుతుంది.