Apollo Chicken : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లలో ఎక్కువగా లభించే చికెన్ వెరైటీస్ లో అపోలో చికెన్ కూడా ఒకటి. అపోలో చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ లలో లభించే అపోలో చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ అపోలో చికెన్ ను చాలా సులభంగా తయారు చేయవచ్చు. రెస్టారెంట్ స్టైల్ అపోలో చికెన్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అపోలో చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ బ్రెస్ట్ – 300 గ్రా., జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, పసుపు – రెండు చిటికెలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, కోడిగుడ్డు – 1, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
టాసింగ్ చేయడానికి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉల్లిపాయ తరుగు – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – చిటికెడు, చిలికిన పెరుగు – 250 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, అజినమోటో – చిటికెడు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
అపోలో చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ బ్రెస్ట్ ను సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో సగం కోడిగుడ్డును వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై వేయించాలి. చికెన్ లోపల వేగి రంగు మారేటప్పుడు మంటను పెంచి చికెన్ కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత టాసింగ్ ప్యాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయలను పింక్ రంగులోకి వచ్చే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత రెడ్ చిల్లీ సాస్, పసుపు వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అజినమోటో వేసి కలపాలి. పెరుగులో నీరు ఉండగానే వేయించిన చికెన్ ను వేసి కలపాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా పెద్ద మంటపై టాస్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అపోలో చికెన్ తయారవుతుంది. రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా అపోలో చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.