Badam Milk : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. బాదం పప్పును తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. బాదం పప్పుతో చేసే బాదం పాల గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ బాదం పాలను ప్రతి ఒక్కరు రుచి చూసే ఉంటారు. ఇవి మనకు బయట షాపుల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ బాదం పాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సులభంగా, రుచిగా ఈ బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – అర కప్పు, నీళ్లు – లీటర్, చిక్కటి పాలు – 550 ఎమ్ ఎల్, కుంకుమ పువ్వు – చిటికెడు, పంచదార – పావు కప్పు.
బాదం పాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బాదం పప్పును, ఒక లీటర్ నీటిని వేసి బాగా ఉడికించాలి. బాదం పప్పు ఉడికిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తరువాత వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. ఇలా పొట్టు తీసేసిన బాదం పప్పును ఒక జార్ లోకి తీసుకుని అందులో 50 ఎమ్ ఎల్ పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. అందులోనే కుంకుమ పువ్వు, పంచదార వేసి మధ్యస్థ మంటపై 5 నుండి 6 పొంగులు వచ్చే వరకు కలుపుతూ మరిగించాలి. పాలు ఇలా మరిగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ ను వేసి కలపాలి. ఇప్పుడు మంటపు చిన్నగా చేసి 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాదం పాలు తయారవుతాయి. వీటిని చల్లగా లేదా వేడిగా ఎలా అయిన తాగవచ్చు. కుంకుమ పువ్వు అందుబాటులో లేని వారు ఇందులో యాలకుల పొడిని వేసుకోవచ్చు. యాలకుల పొడి వేయడం వల్ల పాలు రుచిగా ఉన్నప్పటికి రంగు మాత్రం మారవు. ఇలా తయారు చేసుకున్న బాదం పాలను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా తాగవచ్చు. ఈ బాదం పాలను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రాత్రి పూట ఈ పాలను తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది.