Badusha : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో బాదుషా ఒకటి. బాదుషాను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది ఇష్టంగా తినే తీపి పదార్థాల్లో బాదుషా ఒకటి. చాలా మంది బాదుషాను ఇంట్లో తయారు చేసుకోలేమని భావిస్తారు. కానీ స్వీట్ షాపుల్లో లభించే విధంగా రుచిగా మెత్తగా ఉండే ఈ బాదుషాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చక్కటి రుచిని కలిగి ఉండే ఈ బాదుషాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – పావు కిలో, వంటసోడా – చిటికెడు, బేకింగ్ సోడా – చిటికెడు, డాల్డా – 2 టీ స్పూన్స్, పంచదార – అర కిలో, నీళ్లు – 200 ఎమ్ ఎల్, పటిక – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

బాదుషా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత అందులో వంటసోడా, బేకింగ్ పౌడర్ ను వేసి కలుపుకోవాలి. తరువాత ఇందులో డాల్డాను వేడి చేసి వేయాలి. దీనిని ముందుగా నీళ్లు పోయకుండా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని 5 నిమిషాల పాటు కలుపుకున్న తరువాత దీనిపై తడి వస్త్రాన్ని వేసి నాననివ్వాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే పటికను కూడా వేసి కలపాలి. ఈ పంచదారను తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని మరోసారి బాగా కలపాలి. తరువాత దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బొటన వేలుతో వత్తి బాదుషా ఆకారంలో చేసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలను వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పెద్ద మంటపై బాదుషాను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న బాదుషాలను వెంటనే పంచదార పాకంలో వేయాలి. వీటిని పంచదార పాకంలో 15 నుండి20 సెకన్ల పాటు ఉంచిప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే బాదుషాలు తయారవుతాయి. ఇలా తయారు చేసిన బాదుషాలు గట్టి పడకుండా మూడు నుండి నాలుగు రోజుల పాటు మెత్తగా తాజాగా ఉంటాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా బాదుషాలను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. వీటిని ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా ఇష్టంగా తింటారు.