Banana Rava Kesari : రవ్వతో మనం కేవలం ఉప్మానే కాకుండా తీపి వంటకాలను, చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కేసరి కూడా ఒకటి. రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ రవ్వ కేసరిని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. అరటి పండు వేసి మరింత రుచిగా ఈ రవ్వ కేసరిని మనం తయారు చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే మనం బనానా రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. అందరు ఎంతో ఇష్టంగా తినే ఈ బనానా రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, చిన్న ముక్కలుగా తరిగిన అరటిపండు – 1, పంచదార – అర కప్పు లేదా తగినంత, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, పాలు – 3 కప్పులు.
బనానా కేసరి తయారీ విధానం..
ముందుగా గిన్ఎలో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడవుతుండగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో అరటి పండు ముక్కలు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో మిగిలిన నెయ్యిని వేసి వేడి చేయాలి. తరువాత రవ్వను వేసి కలుపుతూ వేయించాలి. రవ్వ కొద్దిగా రంగు మారగానే వేడి పాలను పోసి కలపాలి.
దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్, అరటి పండు ముక్కలు, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మరోసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బనానా రవ్వ కేసరి తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బనానా కేసరిని తయారు చేసుకుని తినవచ్చు.