Beerakaya Pallila Kura : బీర‌కాయ‌తో ప‌ల్లీల కూర‌ను ఇలా చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Beerakaya Pallila Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీరకాయ‌లు కూడా ఒక‌టి. బీర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బీరకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బీరకాయ‌ల‌తో మ‌నం రుచిగా, సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో బీర‌కాయ ప‌ల్లీల కూర కూడా ఒక‌టి. ప‌ల్లీల పొడి వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే బీరకాయ ప‌ల్లీల కూర త‌యారీ విధానాన్ని అలాగే త‌యారీకి కావ‌ల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీరకాయ ప‌ల్లీల కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీర‌కాయ‌లు – అర‌కిలో, వేయించిన ప‌ల్లీలు – పావు క‌ప్పు, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఇంగువ – రెండు చిటికెలు, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ధ‌నియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 150 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – అర క‌ట్ట‌.

Beerakaya Pallila Kura recipe in telugu make in this method
Beerakaya Pallila Kura

బీరకాయ ప‌ల్లీల కూర త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పల్లీలు, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, త‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, క‌రివేపాకు, ఇంగువ‌ వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. కొద్దిగా నీళ్లు పోసి క‌ల‌పాలి. మసాలాల‌న్నీ చ‌క్క‌గా వేగి నూనె పైకి తేలిన త‌రువాత బీరకాయ ముక్క‌లు, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి బీర‌కాయ ముక్క‌ల‌ను మెత్త‌గా ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి క‌ల‌పాలి.

త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ ప‌ల్లీల కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. బీరకాయ‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బీరకాయ‌లు ఇష్టంలేని వారు కూడా ఈ కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts