Beetroot Kurma : మనం బీట్ రూట్ లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా బీట్ రూట్ లు మనకు సహాయపడతాయి. బీట్ రూట్ తో ఎక్కువగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటారు. ఫ్రైతో పాటు బీట్ రూట్ తో కుర్మాను కూడా తయారు చేసుకోవచ్చు. చపాతీ, రోటీ వంటి వాటితో తినడానికి ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. బీట్ రూట్ ను ఇష్టపడని వారు కూడా ఈ కుర్మాను ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ బీట్ రూట్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
చెక్కు తీసి ముక్కలుగా తరిగిన బీట్ రూట్ – 250 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు -2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు -తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, చిలికిన కమ్మటి పెరుగు – 250 గ్రా..
బీట్ రూట్ కుర్మా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బీట్ రూట్ ముక్కలను వేసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు నీటిని పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసప పోయే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. మసాలాలన్నీ వేగిన తరువాత ఉడికించిన బీట్ రూట్ ముక్కలను నీటితో సహా వేసుకోవాలి. తరువాత వీటిని దగ్గర పడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ముక్కలు కొద్దిగా చల్లారిన తరువాత పెరుగు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ కుర్మా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.తరుచూ బీట్ రూట్ లతో ఫ్రైనే కాకుండా ఇలా కుర్మాను కూడా తయారు చేసి తీసుకోవచ్చు.