Beetroot Vada : బీట్‌రూట్‌ను తినేందుకు సహజంగానే చాలా మంది ఇష్టపడరు. అయితే కొందరు బీట్‌రూట్‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటారు. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే బీట్‌రూట్‌తో ఎంతో రుచికరమైన వడలను కూడా తయారు చేయవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే బీట్‌రూట్ వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
బీట్‌రూట్ తురుము – ఒక కప్పు, శనగపప్పు – ఒక కప్పు, కంది పప్పు – పావు కప్పు, బియ్యం పిండి – రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, ఎండు మిర్చి – రెండు, అల్లం తురుము – ఒక టీస్పూన్, సోంపు పొడి – అర టీస్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.

బీట్‌రూట్ వడలను తయారు చేసే విధానం..
శనగపప్పు, కంది పప్పును విడివిడిగా నానబెట్టుకోవాలి. గంటయ్యాక నీళ్లు వంపేసి రెండింటినీ కలిపి మిక్సీలో వేసి పట్టుకోవాలి. అందులోనే ఎండు మిర్చి, అల్లం తురుము, సోంపు పొడి, ఉప్పు వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఓ గిన్నెలో వేసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వత్తుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన బీట్ రూట్ వడలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టపడతారు.