Bellam Kajjikayalu : మనం అనేక రకాల ఇండి వంటకాలను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటలో కజ్జికాయలు కూడా ఒకటి. కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా పండగలకు వీటిని తయారు చేస్తూ ఉంటాము. కేవలం పండగలకే కాకుండా స్నాక్స్ గా కూడా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ కజ్జికాయలను తయారు చేయడం చాలా సులభం. స్వీట్ షాపుల్లో లభించే విధంగా రుచిగా, క్రిస్పీగా ఉండేలా కజ్జికాయలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సులభంగా కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కజ్జికాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి -ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -చిటికెడు, వేడి నూనె – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – అర కప్పు, పల్లీలు – అర కప్పు, యాలకులు – 3, బెల్లం పొడి – అర కప్పు, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్.
కజ్జికాయల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, రవ్వ వేసి కలపాలి. తరువాత నెయ్యి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. తరువాత కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పల్లీలు కూడా వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన నువ్వులు, యాలకులు వేసి పొడిలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే పల్లీలను కూడా జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే బెల్లం పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
తరువాత ఈ మిశ్రమానంతటిని మరోసారి జార్ లో వేసి పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత దానిని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఈ చపాతీని కజ్జికాయల చెక్కపై వేసి అందులో తగినంత అనగా ఒక టేబుల్ స్పూన్ బెల్లం మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత అంచులకు నీటిని రాసి కజ్జికాయల ఆకారంలో వత్తుకోవాలి. తరువాత ఎక్కువగా ఉండే పిండిని తీసివేయాలి. ఇలావత్తుకున్న కజ్జికాయలను ప్లేట్ లోకి తీసుకోవాలి. కజ్జికాయల చెక్క లేని వారు కూడా ఈ కజ్జికాయలను చేసుకోవచ్చు. ముందుగా వత్తుకున్న చపాతీ మధ్యలో బెల్లం మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత అంచులకు నీటిని రాసి దానిని మధ్యలోకి మడిచి అంచులను గట్టిగా వత్తాలి.
తరువాత కజ్జికాయ అంచులకు మనకు కావల్సిన ఆకారంలో డిజైన్ లాగా వేసుకోవచ్చు. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడైన తరువాత మంటను చిన్నగా చేసి కజ్జికాయలను వేసుకోవాలి. వీటిని చిన్న మంటపై ఒక నిమిషం పాటు రెండు వైపులా కాల్చుకున్న తరువాత మంటను మధ్యస్థంగా చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే కజ్జికాయలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.