Bendakaya Fry Recipe : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బెండకాయలు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో బెండకాయ ఫ్రై ఒకటి. సరిగ్గా వండాలే కానీ బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. తక్కువ నూనెతో జిగురు లేకుండా బెండకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, ధనియాల పొడి – అర టీ స్పూన్.
బెండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను ఫ్యాన్ గాలికి ఒక అర గంట పాటు ఆరబెట్టాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత బెండకాయ ముక్కలను వేసి కలపాలి. ఈ ముక్కలను మధ్యస్థ మంటపై కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై తయారవుతుంది.
దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో లేదా పప్పు, రసం, సాంబార్ వంటి వాటితో కలిపి తినవచ్చు. బెండకాయ ముక్కలు వేగేటప్పుడు వాటిపై మూతను ఉంచకూడదు. అలాగే ఈ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత మాత్రమే ఉప్పు వేయాలి. అప్పుడే బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఉంటుంది. ఈ విధంగా చేసిన బెండకాయను ఫ్రై ను వదిలి పెట్టకుండా అందరూ తింటారు.