Bendakaya Masala Curry : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసుకోదగిన వంటకాల్లో మసాలా కర్రీ కూడా ఒకటి. బెండకాయ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటిలోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో తరుచూ చేసే వంటకాల కంటే ఈ మసాలా కర్రీ మరింత రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ బెండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన బెండకాయలు – పావుకిలో, నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, టమాట ఫ్యూరీ – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – రెండున్నర టీ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చిలికిన పెరుగు – అర కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, కసూరిమెంతి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పెద్ద మంటపై 4 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి చిన్న మంటపై నూనెపైకి తేలే వరకు ఉడికించాలి.
తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత బెండకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి బెండకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కసూరిమెంతి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కర్రీని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.