Bendakaya Masala Curry : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బెండకాయలతో ఎక్కువగా వేపుడు, కూర, పులుసు వంటి వాటినే తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇతర కూరగాయలతో చేసినట్టుగా వీటితో కూడా మనం మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో రుచిగా, సులభంగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన బెండకాయలు – పావు కిలో, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, జీడిపప్పు – 5.
బెండకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు సగానికి పైగా వేగిన తరువాత మసాలా పేస్ట్ కు కావల్సిన మిగిలిన పదార్థాలు వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. బెండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, మరో అరగ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కళాయిపై మూతను ఉంచి మరో 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, పులావ్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో ఈ విధంగా చేసిన మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.