Bendakaya Pakodi : మనం వంటింట్లో తరచుగా బెండకాయలను ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బెండకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో బెండకాయలు ఎంతో సహాయపడతాయి. బెండకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో, రక్త హీనతను తగ్గించడంలో బెండకాయలు ఉపయోగపడతాయి.
బెండకాయలతో మనం ఎక్కువగా వేపుడును, పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. బెండకాయ జిగురుగా ఉంటుందని దీనిని చాలా మంది తినరు. అలాంటి వారు బెండకాయతో ఎంతో రుచిగా ఉండే పకోడీలను తయారు చేసి తీసుకోవడం వల్ల బెండకాయల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. ఇక బెండకాయలతో పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత బెండకాయలు – పావు కిలో, శనగ పిండి – 6 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 4 టేబుల్ స్పూన్స్, వాము – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా.
బెండకాయ పకోడీ తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేయాలి. తరువాత బెండకాయలో గింజలు ఉంటే వాటిని తీసేస్తూ బెండకాయలను సన్నగా, పొడుగ్గా ఉండేలా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పొడుగ్గా తరిగిన బెండకాయలతోపాటు నూనె, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత మరీ పలుచగా కాకుండా తగినన్ని నీళ్లు పోసుకుంటూ కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె పోసి కాగాక బెండకాయల మిశ్రమాన్ని పకోడీలలా వేసి అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పకోడిలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాటా కెచప్ తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.