Crystal Shivling : సాధారణంగా చాలా మంది శివున్ని ఇంట్లో చిత్ర పటాల రూపంలో పూజిస్తుంటారు. లింగం రూపంలో పూజించరు. ఎందుకంటే విగ్రహం అయితే రోజూ నియమ నిష్టలతో పూజలు చేయాలి. కనుకనే చాలా మంది లింగం రూపంలో ఉన్న శివున్ని పూజించరు. అయితే శివ లింగాల్లో స్ఫటిక లింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ లింగాన్ని పూజిస్తే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని.. కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంట్లో అనేక కారణాల వల్ల నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంటుంది. చాలా సార్లు మన చుట్టూ ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీంతో ఇంట్లోని వారందరికీ ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే శివుడి స్ఫటిక లింగాన్ని రోజూ పూజించడం వల్ల ఇంట్లో ఎలాంటి దోషాలు, నెగెటివ్ ఎనర్జీ, దిష్టి ఉండవు. దీంతో అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.
శివుడి స్ఫటిక లింగం సంపదకు, ఆనందానికి ప్రతిరూపం. కనుక ఆ లింగాన్ని పూజిస్తే మనకు సంపద సిద్ధిస్తుంది. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. అలాగే ఏదైనా తీరని కోరిక ఉన్నా నెరవేరుతుందట. వ్యాపారంలో, ఇతర పనుల్లో ఎల్లప్పుడూ అపజయాలు వస్తున్నవారు స్ఫటిక లింగాన్ని పూజిస్తే అన్నింటా విజయాలను సాధిస్తారట. అనుకున్నవి నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
శివుడి స్ఫటిక లింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకిస్తే.. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యు భయం ఉండదు. ఆవు పాలతో అభిషేకిస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. పెరుగు అయితే బలం, కీర్తి ప్రఖ్యాతులు కలుగుతాయి. ఆవు నెయ్యి అయితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. చెరుకు రసంతో ధన వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖం ఉండవు. శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు పత్రాలను ఉంచిన నీటితో అభిషేకం చేస్తే.. అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
స్ఫటిక లింగాన్ని తేనెతో అభిషేకిస్తే.. ఆయుష్షు పెరుగుతుంది. పుష్పాలను ఉంచిన నీటితో అయితే భూలాభం కలుగుతుంది. కొబ్బరినీళ్లతో అభిషేకిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే స్ఫటిక లింగాన్ని పసుపు నీటితో అభిషేకిస్తే.. ఎంతో మంగళకరంగా ఉంటుంది. ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈ విధంగా స్ఫటిక లింగాన్ని పూజించి శివుడి ఆశీస్సులు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.