Bengal Khova Palapuri : ఫేమ‌స్ బెంగాల్ స్వీట్‌.. కోవా పాల‌పూరీ.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Bengal Khova Palapuri : బెంగాలీ ఖోవా పాల పూరీ.. బెంగాలీ వంట‌క‌మైన ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం త‌రుచూ చేసే పాల‌పూరీ కంటే ఈ ఖోవా పాల పూరీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు లేదా స్పెష‌ల్ డేస్ లో అప్పుడ‌ప్పుడూ ఇలా బెంగాలీ ఖోవా పాల‌పూరీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ బెంగాలీ ఖోవా పాల పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగాలీ ఖోవా పాల పూరీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

చిక్క‌టి పాలు – ఒక లీట‌ర్, పంచ‌దార – 1/3 క‌ప్పు, మైదాపిండి – ఒక క‌ప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చి కోవా – అర క‌ప్పు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – పావు క‌ప్పు, ఉప్పు – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, పాల‌పొడి – పావు క‌ప్పు, బాదంగింజ‌ల పొడి – 1/3 క‌ప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్.

Bengal Khova Palapuri recipe make in this method
Bengal Khova Palapuri

బెంగాలీ ఖోవా పాల పూరీ త‌యారీ విధానం..

ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో చిక్క‌టి పాలు, పంచ‌దార వేసి క‌లుపుతూ మ‌రిగించాలి. పాలు స‌గానికి స‌గం అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ మ‌రిగించాలి. పాలు మ‌రుగుతుండ‌గానే ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని అందులో నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పిండిని గ‌ట్టిగా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో కోవాను తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పంచ‌దార‌, ప‌చ్చి కొబ్బ‌రి తురుము, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని ముద్ద లాగా చేసుకున్న త‌రువాత ముందుగా క‌లిపిన పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని వెడల్పుగా వ‌త్తుకుని అందులో పాల‌కోవా ఉండ‌ను ఉంచి అంచుల‌ను మూసివేయాలి.

ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత పూరీలాగా వ‌త్తుకోవాలి. త‌రువాత వీటిని వేడి వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. పూరీని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత మ‌రుగుతున్న పాల‌ల్లో పాల‌పొడి, బాదం గింజ‌ల పొడి, యాల‌కుల పొడి, మ‌రో టీ స్పూన్ నెయ్యి వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను అడుగు నుండి క‌లుపుతూ 300 ఎమ్ ఎల్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత పూరీల‌ను వేసి మ‌రో 5 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని పూర్తీగా చ‌ల్లారిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెంగాలీ ఖోవా పాల పూరీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts