Bilva Patra : బిళ్వ చెట్టు.. దీనిని మారేడు, వెలగ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈచెట్టు మహా శివునికి చాలా ఇష్టం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు. భారతీయులకు మారేడు చెట్టు ఎంతో పవిత్రమైనది. దీని గురించి వేదకాలం నుండి తెలుసు. దేవాలయాల్లో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది. మారేడు ఆకులు మూడు కలిసి శివుని కళ్లలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని ప్రతీతి. శివున్ని బిళ్వ పత్రాలతో పూజించడం శ్రేష్టం. బిళ్వ వృక్షం శివున్ని స్వరూపమని సాక్షాత్తూ దేవతలు భావిస్తారు. శివ పురాణంలో బిళ్వ పత్రం విశిష్టత తెలిపే కథ ఉంది.
ఒకనాడు శనిదేవుడు శివున్ని దర్శించడానికి కైలాసానికి ఏగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివ దేవుడు శనిదేవున్ని విధి దర్మమును పరీక్షించ నెపమునా నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు శివున్ని పట్టి ఉంచగలనని తెలిపాడు. దానితో శివుడు మరునాటి సూర్యోదయం సమయంలో బిళ్వ వృక్షం రూపం దాల్చి ఆ వృక్షము నుందు నివసించాడు. మహేశ్వరునిజాడ తెలియక పార్వతీ దేవితో సహా దేవతలందరూ ముల్లోకాలను గాలించారు. వారికి శివుడి జాడ కానీ శని దేవుడి జాడ కానీ తెలియరాలేదు.
సూర్యాస్తమయం తరువాత బిళ్వ వృక్షం నుండి శివుడు సాకార రూపంగా బయటకు వచ్చాడు. మరుక్షణమే శని దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నన్ను పట్టుకోలేక పోయావే అని శివుడు ప్రశ్నించగా శని దేవుడు నవ్వి నేను పట్టడం వల్లనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిళ్వ వృక్షంలో దాగి ఉన్నది అని అన్నాడు. శనిదేవుడి విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడైనా నన్నే కొద్ది కాలం పట్టి నా యందే నువ్వు వసించి ఉండడం చేత నాటి నుండి నువ్వు శనీశ్వరుడు పేరుతో ప్రసిద్ది నొందగలవు అని వరమిచ్చాడు.
అంతట శనిదోషం ఉన్నవారు ఈ దోషపరిహారార్ధం తనను బిళ్వ పత్రాలతో పూజిస్తే దోష నివారణ జరుగుతుందని కూడా చెప్పాడు. బిళ్వ పత్రాలతో పూజించే వారిని శని దేవుడు బాధించడు అని అభయమిచ్చాడు. లక్ష్మీ దేవి తపస్సు వల్ల బిళ్వ వృక్షం పుట్టింది. లక్ష్మీ దేవిని బిళ్వ నిలయ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వర్చస్సు పొందడానికి సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిళ్వ కొయ్యను అశ్వమేధ యాగంలో ఇలాంటి బిళ్వ రూపాలను ఆరింటిని ప్రతిష్టించారు. బిళ్వ పత్రాన్ని సోమవారం, మంగళ వారం, ఆరుద్ర నక్షత్రం, సంధ్యాసమయం, రాత్రివేళందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు.