Bitter Gourd Masala Curry : చేదుగా ఉండే కూరగాయలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి కాకరకాయలు. చేదుగా ఉంటాయన్న కారణం చేత వీటిని చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయలను ఆహారంగా తీసరుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాకరకాయతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ కాకరకాయలతో మనం చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు కూడా ఈ మసాలా కూరను సులభంగా తయారు చేయవచ్చు. చేదు లేకుండా కాకరకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావు కిలో, పల్లీలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – పది గింజలు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్న ముక్కలుగా తరిగిన పెద్ద టమాట – 1, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పావు లీటర్ నీటిలో నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కాకరకాయ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా ఒక కాకరకాయలను శుభ్రంగా కడిగి గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని వాటి లోపల ఉండే తెల్లటి భాగాన్ని గింజలను తీసి వేయాలి. తరువాత ఈ ముక్కలపై ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత వాటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ ముక్కల్లో ఉండే నీరంతా పోయేలా చేత్తో బాగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ ముక్కలను మరోసారి బాగా కడిగి తడి పోయేలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో పల్లీలు, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలను వేసి రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. ఇప్పుడు కళాయిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత చింతపండు రసం, వేయించిన కాకరకాయ ముక్కలు, మరో టీ గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసి కలపాలి. దీనిపై మరలా మూతను ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయలను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటారు.