Capsicum Omelette : మనం కోడిగుడ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో చేసుకోదగిన వాటిల్లో ఆమ్లెట్ ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ ఆమ్లెట్ మిశ్రమంలో క్యాప్సికాన్ని జత చేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం వేసి చేసే ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికం ముక్కలు వేసి ఆమ్లెట్ ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 2, చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికం – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, మిరియాల పొడి – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టీ స్పూన్.
క్యాప్సికం ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా కోడిగుడ్లను పగలగొట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వీటిని అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత నూనె, మిరియాల పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. తరువాత దీనిపై మిరియాల పొడిని చల్లుకోవాలి. తరువాత దీనిపై మరికొద్దిగా నూనెను వేసుకోవాలి. ఆమ్లెట్ ఒకవైపు ఎర్రగా కాలిన తరువాత నెమ్మదిగా మరోవైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం ఆమ్లెట్ తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ వేసే సాధారణ ఆమ్లెట్ కంటే ఈ విధంగా క్యాప్సికం వేసి చేసిన ఆమ్లెట్ మరింత రుచిగా ఉంటుంది.