Biyyampindi Halwa : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. తీపి వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మనం చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకునే తీపి వంటకాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి వంటకాల్లో బియ్యం పిండి హల్వా కూడా ఒకటి. బియ్యాన్ని ఉపయోగించి చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు కూడా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఈ బియ్యం పిండి హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, పెసర పప్పు – పావు కప్పు, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్,నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 15.
బియ్యం పిండి హల్వా తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని వడకట్టి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆరబెట్టుకున్న బియ్యంతో పాటు పెసరపప్పును కూడా వేసి దోరగా బియ్యం రంగు మారే వరకు బాగా వేయించాలి. తరువాత వేయించిన ఈ బియ్యాన్ని జార్ లో వేసి బొంబాయి రవ్వ మాదిరి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దానిని వడకట్టి మరలా కళాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం మిశ్రమంలో ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం నీరు మరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న రవ్వను వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించాలి. హల్వా దగ్గర పడిన తరువాత మంటను చిన్నగా చేసి మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి.
జీడిపప్పు వేగిన తరువాత దీనిని హల్వాలో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి హల్వా తయారవుతుంది. ఈ హల్వా రెండు నుండి మూడు రోజుల పాటు తాజాగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా బియ్యంతో ఎంతో రుచిగా ఉండే హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. ఈ హల్వాను అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాకుండా బియ్యం పిండితో చేసిన ఈ హల్వాను నైవేథ్యంగా భగవంతుడికి కూడా సమర్పించవచ్చు.