Butter Pakoda : అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ వెరైటీలలో పకోడీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటారు కూడా. పకోడీలు స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి. తరచూ చేసే పకోడీలే కాకుండా బటర్ వేసి ఈ పకోడీలను మనం మరింత రుచిగా కూడా చేసుకోవచ్చు. బటర్ వేసి చేసే ఈ పకోడీలు మరింత రుచిగా మరింత క్రిస్పీగా ఉంటాయి. రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ బటర్ పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు -3 ( మధ్యస్థంగా ఉండేవి), పచ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు – 4, సోంపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన పుదీనా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, కారం – అర టీ స్పూన్, శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బటర్ పకోడా తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సోంపు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, పుదీనా, కరివేపాకు, కారం వేసి కలపాలి. ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటకు వచ్చేలా కలుపుకోవాలి. తరువాత శనగపిండి, బియ్యం పిండి, బటర్ వేసి కలపాలి. ఉల్లిపాయల్లో ఉండే నీటితోనే పిండిని బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తరువాత కదుపుతూ వేయించాలి. ఈ పకోడీలను మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే బటర్ పకోడాలు తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ పకోడీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.