Button Badusha : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో బటన్ బాదుషాలు ఒకటి. చిన్నగా, చాలా రుచిగా ఉండే ఈ బటన్ బాదుషాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ బటన్ బాదుషాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే ఈ బటన్ బాదుషాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బటన్ బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 50 గ్రా., పెరుగు – పావు కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, మైదాపిండి – పావు కిలో, పంచదార – 300 గ్రా., నీళ్లు – 150 ఎమ్ ఎల్, కుంకుమ పువ్వు – చిటికెడు, నిమ్మ ఉప్పు – రెండు చిటికెలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బటన్ బాదుషా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత మైదాపిండి వేసి కలపాలి. ఇందులో వేడి చేసుకున్న నెయ్యిని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిపై దడి వస్త్రాన్ని కప్పి 30 నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే కుంకుమ పువ్వు వేసి ఉడికించాలి. పంచదార కరిగి జిగురులాగా అయిన తరువాత నిమ్మ ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నానబెట్టుకున్న పిండిని తీసుకుని మరోసారి బాగా కలపాలి. తరువాత ఉసిరికాయంత పిండిని తీసుకుంటూ గుండ్రంగా చేసుకోవాలి. తరువాత వీటిని బాదుషా ఆకారంలో వత్తుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బాదుషాలను వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు మధ్యస్థ మంటపై వేయించాలి. రంగు మారిన తరువాత మంటను పెద్దగా చేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న బాదుషాలను ముందుగా తయారు చేసుకున్న పంచదార మిశ్రమంలో వేసుకోవాలి. బాదుషాలతో పాటు పంచదార మిశ్రమం కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ బాదుషాలను 30 నుండి 40 సెకన్ల పాటు నానబెట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బటన్ బాదుషాలు తయారవుతాయి. చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి. ఈ బాదుషాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా బటన్ బాదుషాలను తయారు చేసుకుని తినవచ్చు.