Cabbage Fry : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాబేజ్ కూడా ఒకటి. కానీ క్యాబేజ్ వాసన, రుచి కారణంగా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే క్యాబేజ్ లో ఎన్నో పోషకాలు ఉంటాయని దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనుక దీనిని అందరూ తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. క్యాబేజ్ తో చేసుకోదగిన వంటల్లో క్యాబేజ్ ఫ్రై కూడా ఒకటి. ఈ క్యాబేజ్ ఫ్రై ను అందరూ ఇష్టపడేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన క్యాబేజ్ తరుగు – 400 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండుమిర్చి – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్నాల పప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 6 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 8, జీలకర్ర – ఒక టీ స్పూన్.
క్యాబేజ్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగాక క్యాబేజ్ తురుము వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలిపి మధ్యస్థ మంటపై మాడిపోకుండా వేయించాలి. ఇవి వేగుతుండగానే ఒక జార్ లో మసాలా కారం తయారీకి కావల్సిన పదార్థాలు వేసి మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. క్యాబేజ్ పూర్తిగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా కారాన్ని వేసి కలపాలి. దీనిని రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత పైన కొత్తిమీరను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి రుచిని కలిగి ఉండే క్యాబేజ్ ఫ్రై తయారవుతుంది. దీనిని చపాతీ, రోటి, అన్నం వంటి వాటితో కలిపి తినవచ్చు. ఈ విధంగా చేయడ వల్ల క్యాబేజ్ వాసన రాకుండా ఉంటుంది. దీంతో అందరూ దీనిని ఇష్టంగా తింటారు.