Cabbage Pakoda : క్యాబేజిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యాబేజితో కూర, వేపుడు వంటి వాటితో పాటు రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. క్యాబేజితో చేసుకోదగిన చిరుతిళ్లల్లో క్యాబేజి పకోడి కూడా ఒకటి. క్యాబేజి పకోడి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తినడానికి ఈ పకోడి చాలా చక్కగా ఉంటుంది. రుచిగా కరకరలాడుతూ ఉండేలా క్యాబేజితో పకోడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి – 1 ( మధ్యస్థంగా ఉన్నది), ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, మైదాపిండి – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – రెండు టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు.
క్యాబేజి పకోడి తయారీ విధానం..
ముందుగా క్యాబేజిని వీలైనంత చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి క్యాబేజిని నలుపుతూ బాగా కలపాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాల్నీ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని పకోడి పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పకోడిలా లేదా బాల్స్ లాగా కూడా వేసుకోవచ్చు.
వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పకోడి తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే క్యాబేజి పకోడి తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. క్యాబేజితో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పకోడీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.