Lord Brahma : మనిషి జన్మించిన వెంటనే బ్రహ్మ దేవుడు తలరాతను రాస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ తలరాతకు అనగుణంగా ఆ మనిషి జీవితం ఆధార పడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ తమ తలరాత బాగా లేదని, అందుకనే అంతా నష్టమే జరుగుతుందని దిగులు చెందుతుంటారు. తలరాత అనేది నిజమే.
మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా.. ఆశించిన ఫలితం అయితే దక్కదు. కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. అంతా తలరాత అని మనం సర్దుకుపోతుంటాం. అయితే అలాంటి తలరాతను మార్చుకునేందుకు వీలుంటుందా ? అంటే.. అందుకు పురాణాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
మనం పుట్టినప్పుడు బ్రహ్మ దేవుడు మన నుదుటిపై ఒక వాక్యం రాస్తాడట. నేను రాసే రాతతోనే కాక, మీరు చేసే పనులు, చేసే పాప పుణ్యాలతో కూడా మీ తలరాత మారుతుంది.. అని రాస్తాడట. దీన్ని బట్టి చూస్తే మనం చేసే పనులు, పాప పుణ్యాలు కూడా మన తలరాతను నిర్దేశిస్తాయని స్పష్టమవుతోంది. అందుకు ఉదాహరణగా ఒక రాజు కథను చెప్పవచ్చు.
పూర్వం విభుముఖుడు అనే ఓ రాజు ఉండేవాడు. అతనికి 50వ ఏట మరణ గండం ఉంటుంది. జ్యోతిష్యుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న అతను దాన్నుంచి బయట పడేందుకు అనేక పుణ్య కార్యాలు చేస్తాడు. అలాగే దైవార్చన, మృత్యుంజయ జపం చేస్తాడు. దీంతో అతను మరణ గండం నుంచి బయట పడి నిండు నూరేళ్లు జీవిస్తాడు.
ఇక పురాణాల ప్రకారం మహాభారతంలో దుర్యోధనుడికి 128 ఏళ్ల ఆయుష్షు ఉండేదట. కానీ అతను చేసిన పాపపు పనులు.. ముఖ్యంగా ద్రౌపదిని చెరబట్టడం వల్ల అతను 60వ ఏటనే చనిపోయాడు. ఈ విధంగా మనం చేసే పనులు, పాప పుణ్యాలతోనే మన తలరాత నిర్ణయమవుతుందన్నమాట. అందుకనే నిత్యం దైవాన్ని పూజించాలని, సమాజంలో అందరికీ మంచి చేసే పనులు చేయాలని, ఇతరులకు సహాయం చేయాలని.. చెబుతుంటారు.