Capsicum Bajji : మనకు సాయంత్రం సమయంలో బయట ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో బజ్జీలు కూడా ఒకటి. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం రకరకాల రుచుల్లో ఈ బజ్జీలను తయారు చేస్తూ ఉంటాం. తరచూ చేసే బజ్జీలతో పాటు మనం క్యాప్సికంతో కూడా బజ్జీలను వేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసే బజ్జీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అందరికి నచ్చేలా, ఇష్టంగా తినేలా క్యాప్సికంతో బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాప్సికం – 6, శనగపిండి – ఒక కప్పు, వాము – అర టీ స్పూన్, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్యాప్సికం బజ్జీ తయారీ విధానం..
ముందుగా క్యాప్సికంను శుభ్రపరిచి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిలో ఉండే గింజలను తీసేసి వాటిని నిలువుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా గంటె జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం బజ్జీ తయారవుతుంది.
దీనిని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా క్యాప్సికం బజ్జీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా చేసుకుని తినడానికి ఈ క్యాప్సికం బజ్జీలు చక్కగా ఉంటాయి. ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు.