Capsicum Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్సికం కూడా ఒకటి. వీటిని వివిధ రకాల వంటకాల్లో, సలాడ్ లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాప్సికంలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కేవలం ఇతర వంటకాల్లో వాడడమే కాకుండా క్యాప్సికంతో ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సలుభంగా క్యాప్సికం ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికం – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, శనగపప్పు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 1, ఎండుకొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
క్యాప్సికం ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు గింజలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని పూర్తిగా వేగే వరకు వేయించాలి. క్యాప్సికం ముక్కలు వేగిన తరువాత కారం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుకొబ్బరి పొడి వేసి కలపాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యాప్సికం ఫ్రై ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు క్యాప్సికంను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.