Shakkar Para : షక్కర్ పార.. ఈపేరును మనలో చాలా మంది విని ఉండరు. ఇది ఒక తీపి వంటకం. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా తయారు చేసుకునేంత సలుభంగా ఉంటుంది. వీటిని పదిరోజుల పాటు నిల్వ చేసుకుని కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉండడంతో పాటు సులభంగా తయారు చేసుకోగలిగే ఈ షక్కర్ పారను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షక్కర్ పార తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 2 కప్పులు, నీళ్లు – అర కప్పు, నెయ్యి – అర కప్పు, పంచదార – అరకప్పు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
షక్కర్ పార తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నెయ్యి, నీళ్లు, పంచదార వేసి పంచదార కరిగే వరకు బాగా కలపాలి. తరువాత ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని, బేకింగ్ సోడాను, ఉప్పును, యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత మిగిలిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ అర ఇంచు మందంతో చపాతీలా రుద్దుకోవాలి. తరువాత చాకుతో అంచులను తీసేసి చతురస్రాకారంలో చేసుకోవాలి. ఇప్పుడు చాకుతో అన్ని సమానంగా వచ్చేలా చతురస్రాకారంలో లేదా డైమండ్ ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కట్ చేసుకున్న ముక్కలను వేయాలి.
ఈ ముక్కలు కొద్దిగా వేగి పైకి తేలిన తరువాత స్టవ్ ఆన్ చేసి పెద్ద మంటపై వీటిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇవి 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే షక్కర్ పార తయారవుతుంది. వీటి తయారీలో నీళ్లకు బదులుగా పాలను కూడా వాడవచ్చు. అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ షక్కర్ పారను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. తియ్యగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా తక్కువ సమయంలో అయ్యే ఈ షక్కర్ పారను తయారు చేసుకుని తినవచ్చు.