Caramel Popcorn : మనలో పాప్ కార్న్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దీనిని అందరూ ఇష్టంగా తింటారు. అలాగే వివిధ రుచుల్లో ఈ పాప్ కార్న్ ను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో క్యారమెల్ పాప్ కార్న్ కూడా ఒకటి. ఈ పాప్ కార్న్ మనకు ఎక్కువగా సినిమా థియేటర్స్ లో, మల్టీప్లెక్స్ వద్ద లభిస్తుంది. ఈ పాప్ కార్న్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఈ పాప్ కార్న్ ను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట ఎక్కువ ధరలకు కొనే బదులు చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. క్యారమెల్ పాప్ కార్న్ ను చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారమెల్ పాప్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, పాప్ కార్న్ – ముప్పావు కప్పు, పంచదార – ముప్పావు కప్పు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, వంటసోడా – ఒక టీ స్పూన్.
క్యారమెల్ పాప్ కార్న్ తయారీ విధానం..
ముందుగా లోతుగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పాప్ కార్న్ గింజలు వేసి కలపాలి. వీటిని అర నిమిషం పాటు వేయించిన తరువాత మూత పెట్టాలి. పాప్ కార్న్ తయారయ్యేటప్పుడు కళాయిని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. పాప్ కార్న్ పూర్తిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పంచదార వేసి వేడి చేయాలి. ఈ పంచదారను కదిలించకుండా అలాగే ఉంచాలి. పంచదార కరిగిన తరువాత బటర్ వేసుకోవాలి. పంచదార కరిగి కొద్దిగా నురుగు వచ్చేటప్పుడు వంటసోడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పాప్ కార్న్ వేసి అంతా కలిసేలా కలుపుకుని ఈ పాప్ కార్న్ ఒక ట్రేలోకి తీసుకుని చల్లారే వరకు అలాగే ఉంచాలి. పాప్ కార్న్ చల్లారిన తరువాత విడివిడిగా చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారమెల్ పాప్ కార్న్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.