Carrot Karam : విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాల్లో క్యారెట్ ఒకటి. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మన శరీరానికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో క్యారెట్ మనకు ఎంతో సహాయపడుతుంది. క్యారెట్ ను వివిధ రకాల వంటల్లో వాడడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ కారం చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా దీనిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో అయ్యే ఈ క్యారెట్ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్స్ – 2 ( పెద్దవి), ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, నిమ్మకాయ – 1 ( పెద్దది), పసుపు – అర టీ స్పూన్.
క్యారెట్ కారం తయారీ విధానం..
ముందుగా క్యారెట్ లను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. తరువాత కళాయిలో మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క్యారెట్ తురుము, ఉప్పు, కారం, ఆవ పిండి, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. ఇలా తయారు చేసుకున్న తాళింపును ముందుగా సిద్దం చేసుకున్న క్యారెట్ తురుములో వేసి కలపాలి.
తరువాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యారెట్ తో ఈ విధంగా కారాన్ని తయారు చేసుకుని తినడం వల్ల క్యారెట్ వల్ల కలిగే ప్రయోజనాలన్నింటిని మనం పొందవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా క్యారెట్ కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ క్యారెట్ కారాన్ని లొట్ట లేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.