Cauliflower 65 : కాలిఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. దీన్ని తినేందుకు అందరూ ఇష్టపడరు. కాలిఫ్లవర్‌తో మనం టమాటా, ఫ్రై వంటి కూరలను చేస్తుంటాం. అయితే వీటితో కాలిఫ్లవర్ 65ని చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాలిఫ్లవర్ అంటే ఇష్టం లేని వారు కూడా దాంతో ఈ వంటకం చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక కాలిఫ్లవర్ 65ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
కాలిఫ్లవర్ – 1 (మీడియం సైజ్ ఉండాలి), కరివేపాకు – 3 రెబ్బలు, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, మిరపకారం – రెండు టీస్పూన్లు, గరం మసాలా – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీస్పూన్లు, నూనె – వేయించడానికి తగినంత.
కాలిఫ్లవర్ 65 ని తయారు చేసే విధానం..
ఒక పాత్రలో మైదా పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, మిరప కారం, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి. కాలిఫ్లవర్‌ను శుభ్రం చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేలా విడదీయాలి. ఒక పాత్రలో నీళ్లు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద ఉంచి కొద్దిగా వేడయ్యాక విడదీసిన కాలిఫ్లవర్‌ను అందులో వేసి కొద్ది సేపు ఉడికించి తీసేసి కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమానికి జత చేయాలి. స్టవ్ మీద బాణలిలో నూనె కాగాక కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసి బాగా వేగాక పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. కరివేపాకుతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అన్నం, చపాతీలలోకి మాత్రమే కాదు, స్నాక్స్‌లా తిన్నా కూడా కాలిఫ్లవర్ 65 ఎంతో రుచిగా ఉంటుంది.