Chamadumpa Fry : దుంపజాతికి చెందిన వాటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిల్లో చామదుంపలు ఒకటి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇతర దుంపల వలె చామదుంపలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. షుగర్ ను నియంత్రించడంలో, రోగ నిరోధకశక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో,కంటి చూపును మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా చామదుంపలు మనకు ఉపయోగపడతాయి. ఈ చామదుంపలతో మనం వేపుడును కూడా తయారు చేస్తూ ఉంటాం. చామదుంపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చామదుంపల వేపుడును వంటరాని వారు కూడా సులభంగా చేసుకునేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చామదుంప ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చామదుంపలు – అరకిలో, నానబెట్టిన చింతపండు – రెండు రెమ్మలు, నీళ్లు – తగినన్నినూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్.
చామదుంప ఫ్రై తయారీ విధానం..
ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ లో తీసుకోవాలి. తరువాత దానిలో చింతపండు పులుసు, రెండు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టాలి. వీటిని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చామదుంపల పొట్టును తీసి గుండ్రంగా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చామ దుంప ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా కలపకుండా వేయించుకోవాలి. ముక్కలు సగం వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామదుంపల ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, రసం, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చామదుంపల ఫ్రైను అందరూ ఇష్టంగా తింటారు.