Chennur Chicken Biryani : చెన్నూర్ చికెన్ బిర్యానీ… ఈ పేరును మనలో చాలా మంది వినే ఉంటారు. అలాగే ఈ చికెన్ బిర్యానీని కూడా రుచి చూసే ఉంటారు. ఆకుకూరలు వేసి చిట్టి ముత్యాల బియ్యంతో చేసే ఈ చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని చెప్పవచ్చు. తక్కువ మసాలాలతో చేసే ఈ బిర్యానీ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో తరుచూ ఒకేరకం బిర్యానీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ చెన్నూరు చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నూర్ స్టైల్ చికెన్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన చిట్టి ముత్యాల బియ్యం – ముప్పావుకిలో, నూనె – ముప్పావు కప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకులు – 2, నల్ల యాలకులు – 2, యాలకులు – 2, మరాఠీ మొగ్గలు – 2, జాపత్రి – 1, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన మెంతికూర – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – అర కప్పు, తరిగిన పుదీనా – ముప్పావు కప్పు, తరిగిన టమాటాలు – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ మసాలా – ఒక టేబుల్ స్పూన్, చికెన్ – కిలో, ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, పెరుగు – ఒక కప్పు, నిమ్మరసం – అర చెక్క.
చెన్నూర్ స్టైల్ చికెన్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతికూర, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలిపి మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత పెరుగు వేసి కలపాలి.
ఇప్పుడు మంటను మధ్యస్థంగా చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ను పూర్తిగా ఉడికించాలి. చికెన్ ఉడిక లోపు మరో స్టవ్ మీద గిన్నెలో నీటిని పోసి అందులో ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 80 శాతం ఉడికించిన తరువాత వడకట్టాలి. ఈ అన్నాన్ని ఉడికిన చికెన్ పై వేసి మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పాత పెనాని ఉంచి దానిపై చికెన్ గిన్నెను ఉంచి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత అంతాకలిసేలా కలుపుకుని మంటను చిన్నగా చేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెన్నూరు చికెన్ తయారవుతుంది. దీనిని గోంగూర చట్నీ, రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేరకం చికెన్ బిర్యానీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.