Chepala Pulusu : మనం మాంసాహార ఉత్పత్తులు అయిన చేపలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చేపలను ఆహారంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చేపల్లో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. చేపలతో చేసే వంటకాలలో చేపల పులుసు కూడా ఒకటి. పాతకాలంలో చేసే చేప పులుసు ఎంతో రుచిగా ఉండేది. పాతకాలంలో చేసినట్టుగా చేపల పులుసును రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – 1 కిలో, పసుపు – అర టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – 30 గ్రాములు, పెద్దగా తరిగిన ఉల్లిపాయలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చి మిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, మెంతిపొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి 20 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక వెడల్పుగా ఉండే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి అవి రంగు మారే వరకు వేయించుకోవాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును, కారాన్ని, పసుపును, ధనియాల పొడిని, జీలకర్ర పొడిని, మెంతి పొడిని వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు చేప ముక్కలను వేసి అంతా కలిసేలా మరోసారి బాగా కలపాలి. తరువాత చింతపండు గుజ్జును, రెండు గ్లాసుల నీళ్లను లేదా తగినన్ని నీళ్లను పోయాలి. ఇప్పుడు చేప ముక్కలను గంటెతో కలపకుండా కళాయిని పట్టుకుని కదిలించి మూత పెట్టి చిన్న మంటపై 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి కళాయిపై మూత పెట్టి పులుసు చల్లగా అయిన తరువాత అన్నంతో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులుసు తయారవుతుంది. ఈ విధంగా ఏ రకం చేపలతో చేసినా కూడా పులుసు రుచిగా ఉంటుంది. అన్నంతో కలిపి తింటే ఈ చేపల పులుసు రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.