Chicken Drumsticks : చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో కూర, బిర్యానీ, పులావ్ వంటి వాటినే కాకుండా ఇతర వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన వాటిల్లో చికెన్ డ్రమ్ స్టిక్స్ కూడా ఒకటి. ఇవి పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. ఈ డ్రమ్ స్టిక్స్ మనకు రెస్టారెంట్ లలో, ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా లభ్యమవుతుంది. బయట లభించే విధంగా ఉండే ఈ డ్రమ్ స్టిక్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. రుచిగా, సులభంగా ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ డ్రమ్ స్టిక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ వింగ్స్ – 6, అల్లం పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, బియ్యం పిండి – అర కప్పు, ఎగ్స్ – 2 , మైదాపిండి – అర కప్పు, ఓట్స్ పౌడర్ – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, మిక్స్డ్ హెర్బ్స్ – అర టీ స్పూన్,నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారీ విధానం..
ముందుగా స్కిన్ తో ఉన్న చికెన్ వింగ్స్ ను తీసుకుని శుభ్రంగా కడిగి అర గంట పాటు ఉప్పు నీటిలో ఉంచాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, మిరియాల పొడి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ వీటిని నాలుగు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత వీటిని బయటకు తీసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో మైదాపిండి, ఓట్స్ పౌడర్, కార్న్ ఫ్లోర్, బ్రెండ్ క్రంబ్స్, మిక్స్డ్ హెర్బ్, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని బాగా కలపాలి.
ఇప్పుడు చికెన్ వింగ్స్ ను తీసుకుని కోడి గుడ్ల మిశ్రమంలో ముంచి తరువాత ఓట్స్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు ఓట్స్ మిశ్రమం బాగా పట్టేలా చూసుకోవాలి. ఇలా అన్నింటికి పట్టించిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని చికెన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారవుతాయి. వీటిని మయనీస్, టమాట కిచెప్, గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో అప్పుడప్పుడు ఇలా డ్రమ్ స్టిక్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.