Chicken Leg Piece Fry : చికెన్.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సరే నోరు ఊరిపోతుంది. దీంతో అనే రకాల వంటకాలను తయారు చేసుకుని తింటుంటారు. కూర, ఫ్రై, బిర్యానీ.. ఇలా చాలా రకాల వంటలను చికెన్‌తో చేస్తుంటారు. అయితే కేవలం చికెన్ లెగ్స్‌తో మాత్రమే కొన్ని వంటలను చేయవచ్చు. వాటిల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సరిగ్గా చేయాలేకానీ లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇక చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ లెగ్ పీస్ లు – 2, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, సన్నగా తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పుడ్ కలర్ – చిటికెడు.
చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా చికెన్ లెగ్ పీస్ లను శుభ్రంగా కడిగి చాకుతో అన్ని వైపులా గాట్లు పెట్టి అర టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి లెగ్ పీస్ లకు బాగా పట్టించాలి. తరువాత ఒక గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను అన్నింటినీ వేసి కలిపి లెగ్ పీస్ లకు బాగా పట్టించి అర గంట పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత అన్నీ పట్టించి ఉంచిన లెగ్ పీస్ లను వేసి అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత లెగ్ పీస్ లను బయటకు తీయాలి. ఈ విధంగా అన్ని లెగ్ పీస్‌లను ఫ్రై చేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారవుతుంది. దీనిని నిమ్మ రసం, ఉల్లిపాయలతో కలిపి లేదా పప్పు , సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.