Sweet Corn Garelu : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. స్వీట్ కార్న్ ను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని ఉడికించి, వేయించి తీసుకోవడంతో పాటు ఈ స్వీట్ కార్న్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. స్వీట్ కార్న్ తో మనం ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ తో చేసే ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్వీట్ కార్న్ తో గారెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – 2, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, శనగపిండి – 4 టీ స్పూన్స్, బియ్యం పిండి – 4 టీ స్పూన్స్, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్వీట్ కార్న్ గారెల తయారీ విధానం..
ముందుగా స్వీట్ కార్న్ గింజలను తీసుకుని జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ గారెలు తయారవుతాయి. వీటిని నేరుగా తిన్నా లేదా టమాట కిచప్, పల్లీ చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమాయల్లో స్వీట్ కార్న్ తో ఈ విధంగా గారెలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా గారెలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.