Chicken Pakora : మనం తరచూ చికెన్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. శరీర ఆకృతి కోసం వ్యాయామాలు చేసే వారికి చికెన్ ఎంతగానో సహాయపడుతుంది. చికెన్ తో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా బయట లభించే విధంగా ఉండే చికెన్ పకోడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత బియ్యం పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లను వేసి పిండి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. చివరగా పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా అన్ని వేసి కలిపిన తరువాత చికెన్ ను ఫ్రిజ్ లో ఉంచి రెండు గంటల పాటు మారినేట్ చేసుకోవాలి.
తరువాత చికెన్ బయటకు తీసి మరోసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత చికెన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడి తయారవుతుంది. ఈ పకోడి తయారు చేసేటప్పుడు చికెన్ ముక్కలు చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఈ చికెన్ పకోడిని నిమ్మరసం, ఉల్లిపాయతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అందరూ కూడా ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటారు.