Chicken Soup : మనకు రెస్టారెంట్ లలో లభించే వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. చికెన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. స్టాటర్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా చికెన్ సూప్ ను తాగితే ఎంతో చక్కగా ఉంటుంది. అయితే సూప్ ను తాగాల్సిన ప్రతిసారి రెస్టారెంట్ కు వెళ్లాల్సిన పని లేదు. మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ ను తయారు చయడం చాల సులభం. వేడి వేడిగా కమ్మగా ఉండే చికెన్ సూప్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 150 గ్రా., నెయ్యి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – లీటర్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, టమాట సాస్ – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్డు – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా.
చికెన్ సూప్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి 4 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై చికెన్ మెత్తగా అయ్యే వరకు వేయించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ముక్కలను ప్లేట్ లోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈముక్కలను మరలా కళాయిలో వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నీటిని మరిగించాలి. నీరు మరిగిన తరువాత మిరియాల పొడి, సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్, టమాట సాస్ వేసి కలపాలి.
దీనిని మరో 3 నిమిషాల పాటు మరిగించాలి. సూప్ మరుగుతుండగానే ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకుని బాగా కలపాలి. తరువాత మరో గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో నీళ్లు పోసి కలపాలి. సూప్ ను మరిగించిన తరువాత అందులో కోడిగుడ్డు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి కలిపి 3 నిమిషాల పాటు మరిగించాలి. సూప్ చిక్కబడిన తరువాత కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ సూప్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు చికెన్ సూప్ ను తయారు చేసుకుని వేడి వేడిగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.