Chicken Sweet Corn Soup : చికెన్ స్వీట్ కార్న్ సూప్.. చికెన్ మరియు స్వీట్ కార్న్ తో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. చలికాలంలో చాలా మంది చలి నుండి ఉపశమనాన్ని పొందడానికి టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. టీ, కాఫీలకు బదులుగా ఇలా చికెన్ సూప్ ను చేసి తీసుకోవడం వల్ల చలి నుండి ఉపశమనం పొందడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ సూప్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఈ సూప్ ను తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ చికెన్ స్వీట్ కార్న్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ గింజలు – పావు కప్పు, నీళ్లు – 500 ఎమ్ ఎల్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బోన్ లెస్ చికెన్ – 50 గ్రా., సన్నని క్యారెట్ తరుగు – 2 టీ స్పూన్స్,సన్నని ఫ్రెంచ్ బీన్స్ తరుగు – ఒక టేబుల్ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, అరోమేటిక్ పౌడర్ – అర టీస్పూన్, నల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, బీట్ చేసిన కోడిగుడ్డు మిశ్రమం – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్.
చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం..
ముందుగా స్వీట్ కార్న్ గింజలను జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి అందులో మిక్సీ పట్టుకున్న కార్న్, చికెన్ ముక్కలు వేసి ఉడికించాలి. మధ్య మధ్యలో నీటిపై ఉండే తేటను తీసేస్తూ ఉండాలి. చికెన్ ఉడికిన తరువాత క్యారెట్, ప్రెంచ్ బీన్స్, పంచదార, అరోమేటిక్ పౌడర్ వేసి కలపాలి. వీటిని 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మిగిలిన పొడులన్నీ వేసి కలపాలి. తరువాత కోడిగుడ్డు మిశ్రమం వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలిపి సూప్ లో వేసుకోవాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.