Chole Masala Curry : తెల్ల శనగలు.. వీటినే చోలే ( పంజాబీలో) అని కూడా అంటారు. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తెల్ల శనగలను ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అత్యధికంగా ప్రోటీన్లను కలిగి ఉన్న వృక్ష సంబంధమైన ఆహారాల్లో ఈ శనగలు ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు బరువును తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. ఫోలిక్ యాసిడ్, ఫైబర్, మెగ్నిషియం, జింక్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి పోషకాలు వీటిలో అత్యధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని, జీర్ణ శక్తిని, ఎముకల ధృడత్వాన్ని పెంచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. బీపీని, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న తెల్ల శనగలను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే వంటకాలల్లో చోలే మసాలా కూర ఒకటి. ఎంతో రుచిగా ఉండే ఈ చోలే మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చోలే మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
6 నుండి 7 గంటలు పాటు నానబెట్టిన తెల్ల శనగలు – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చి మిర్చి- 3, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, చోలే మసాలా – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్.
మసాలా దినుసులు..
బిర్యానీ ఆకు – ఒకటి, దాల్చిన చెక్క – 2 (చిన్నవి), యాలకులు- 3, లవంగాలు – 5.
చోలే మసాలా కూర తయారీ విధానం..
నానబెట్టుకున్న శనగలను కుక్కర్‌లో వేసి నీళ్లను పోసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటాలు, బిర్యానీ ఆకు తప్పు మిగిలిన మసాలా దినుసులను వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె కాగాక జీలక్రర, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ , కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటాల మిశ్రమాన్ని వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఛోలే మసాలా, పెరుగు వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల తరువాత ఉడికించిన శనగలను నీళ్లతో పాటు వేసి కలిపి10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తరువాత కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చోలే మసాలా కూర తయారవుతుంది. జీరా రైస్, చపాతీ, పుల్కా వంటి వాటితో ఈ కూరను కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా శనగలల్లో ఉండే పోషకాలన్నీ శరీరానికి లభిస్తాయి.