Coconut Biscuits : మనకు బయట బేకరీలల్లో లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో కొకోనట్ బిస్కెట్లు కూడా ఒకటి. తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. అదే రుచితో ఈ కొకోనట్ బిస్కెట్లను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒవెన్ ఉండాలే కానీ వీటిని చేయడం చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కొకోనట్ బిస్కెట్లను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 100 గ్రా., పంచదార పొడి – 50 గ్రా., బటర్ – 80 గ్రా., ఎండు కొబ్బరి పొడి – 20 గ్రా..
కొకోనట్ బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జల్లెడను ఉంచి అందులో మైదాపిండి, పంచదార పొడి వేసి జల్లించుకోవాలి. తరువాత అందులో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న బటర్ ను వేసి బాగా కలపాలి. తరువాత ఎండుకొబ్బరి పొడి వేసి కలపాలి. తరువాత పిండిని పాలిథిన్ కవర్ తో చుట్టుకుని ఒక రోజంతా ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత దీనిని బయటకు తీసి మరో 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత పొడి చల్లుకుంటూ చపాతీ కర్రతో మందంగా చపాతీలా పగుళ్లు లేకుండా వత్తుకోవాలి. తరువాత బిస్కెట్ కట్టర్ తో లేదా అంచు పదునుగా ఉండే చిన్న గ్లాస్ తో బిస్కెట్ల ఆకారంలో వత్తుకోవాలి. వీటిపై మనకు కావల్సిన ఆకారంలో డిజైన్ చేసుకోవచ్చు. తరువాత ఒక ట్రేలో పొడి మైదాపిండి చల్లుకుని అందులో కట్ చేసుకున్న బిస్కెట్లను ఉంచాలి.
ఇప్పుడు ఈ ట్రేను ఫ్రీహీట్ చేసిన ఒవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 18 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తరువాత వీటిని బయటకు తీసి చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ బిస్కెట్లు తయారవుతాయి. వీటిని గాలి గలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా కొకోనట్ బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.