Coconut Milk Tomato Charu : మనం టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలు లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. అనేక రకాల కూరలతో పాటు ఈ టమాటాలతో మనం ఎంతో రుచిగా ఉండే చారును కూడా తయారు చేస్తాము. టమాట చారు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ టమాట చారును ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట చారును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసి చేసే ఈ టమాట చారు మరింత రుచిగా ఉంటాయి. ఈ చారును తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా కొబ్బరి పాలు పోసి టమాట చారును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – 2 టీ స్పూన్స్, కందిపప్పు – 2 టీ స్పూన్స్, బియ్యం -ఒక టీ స్పూన్, ధనియాలు -2 టీ స్పూన్స్, మిరియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, ఎండుమిర్చి – 3, టమాటాలు – 4, నీళ్లు – 2 కప్పులు, తరిగిన పచ్చిమిర్చి -4, ఉప్పు -తగినంత, పసుపు – అర టీ స్పూన్, బెల్లం – చిన్న ముక్క, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, కొబ్బరి పాలు – ఒక కప్పు, నూనె – 2 టీ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు -4, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, ఇంగువ – పావు టీస్పూన్.
టమాట చారు తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపప్పు, కందిపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత బియ్యం, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో టమాటాలకు గాట్లు పెట్టి వేసుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి టమాటాలను ఉడికించాలి. టమాటాలు ఉడికిన తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మిక్సీ పట్టుకున్న టమాట ఫ్యూరీ, పసుపు, ఉప్పు, నీళ్లు, చింత పండు రసం, కరివేపాకు, పచ్చిమిర్చి, బెల్లం వేసి వేడి చేయాలి. దీనిని 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న రసం పొడి 3 టీ స్పూన్స్, కొబ్బరి పాలు పోసి కలపాలి.
దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఇంగువ వేసి కలపాలి. తువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాళింపును చారులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే టమాట చారు కంటే ఈ విధంగా కొబ్బరి పాలు పోసి చేసిన టమాట చారు మరింత రుచిగా ఉంటుంది. ఈ చారును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.