Coriander Leaves Upma : కొత్తిమీరను మనం సహజంగానే రోజూ కూరల్లో వేస్తుంటాం. కానీ తినే ఆహారంలో కొత్తిమీర వస్తే మాత్రం తీసి పక్కన పెడతారు. వాస్తవానికి కొత్తిమీరను పోషకాలకు గనిగా చెబుతారు. దీన్ని తినడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. కొందరు కొత్తిమీరతో నేరుగా పచ్చడి, కూర వంటివి చేస్తుంటారు. అయితే కొత్తిమీరతో ఉప్మాను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్టరు. మళ్లీ మళ్లీ కావాలని చెప్పి స్వయంగా తయారు చేసుకుంటారు కూడా. అంత టేస్టీగా ఉంటుంది. ఇక కొత్తిమీర ఉప్మాను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – పావు కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్లు, మినప పప్పు – 2 టీస్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్, కరివేపాకు – 4 రెబ్బలు, ఉల్లిపాయలు – 2, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తురుము – 2 కప్పులు, పచ్చి మిర్చి – 4, జీలకర్ర – 1 టీస్పూన్, నిమ్మరసం – 1 టీస్పూన్.

కొత్తిమీర ఉప్మాను తయారు చేసే విధానం..
నాన్ స్టిక్ పాన్‌లో రవ్వ వేసి నాలుగైదు నిమిషాల పాటు వేయించి తీయాలి. కొత్తిమీర, పచ్చి మిర్చి, జీలకర్రలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి నిమ్మరసం పిండి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేసి మినప పప్పు, ఆవాలు వేసి వేగాక కరివేపాకు కూడా వేసి వేయించాలి. తరువాత సన్నగా పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో రుబ్బిన కొత్తిమీర మిశ్రమం వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు సుమారుగా ముప్పావు లీటర్ వేడి నీళ్లు పోసి ఉప్పు వేసి మరిగించాలి. తరువాత రవ్వ వేసి మీడియం మంటపై కలుపుతూ నీళ్లన్నీ ఆవిరై రవ్వ ఉడికే వరకు ఉంచాలి. రవ్వ ఉడికిన తరువాత దించేయాలి. దీంతో వేడి వేడి కొత్తిమీర ఉప్మా రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా చట్నీతోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.