Crispy Chicken Fry : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో మనం చేసుకోదగిన వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రైను కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా 10 నుండి 15 రోజుల పాటు నిల్వ ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 5, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 500 గ్రా., పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కారం – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
క్రిస్పీ చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రపరిచి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. ఈ చికెన్ ను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకోవాలి. చికెన్ ను ఇలా నూనె పైకి తేలే వరకు వేయించుకున్న తరువాత జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 10 రోజులకు పైగా నిల్వ ఉంటుంది. పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ ఫ్రైతో అప్పుడప్పుడూ ఈ విధంగా కూడా చికెన్ ఫ్రైను తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ ఫ్రైను ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు.